ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 12-5 ముఖారి సం: 10-070
పల్లవి:
సవతుల మైనాను సంగతి దప్పఁ దగునా
రవళి వావిలిపాటి రామచంద్రుముందర
చ. 1:
నీ వనఁగా నే ననఁగా నిష్టూరా లేఁటికే
చేవదేరే మాఁట లెల్ల చిగిరించీని
మోవరాని దూరు లెల్ల మోపులు గట్టఁగాను
వేవేగ నిన్నియు మనవిభుఁడు మోఁచీనా
చ 2:
కా దనఁగా నౌ ననఁగా కరక రేమిటికే
మీఁద మీఁద జగడాలు మితిమీరీని
వాదుల యీ సుద్దు లెల్ల వాములు వెట్టెఁగాను
కా దని మనవిభుఁడు గాదెలఁ బోసీనా
చ. 3:
రమ్మనఁగ పొమ్మనఁగ రారాఁపు లేఁటికే
దొమ్మి రేఁగి కాఁకలు తోదోపు లాడీని
నమ్మించి శ్రీవెంకటనాథుఁడు నిన్ను నన్నును
సమ్మతిగాఁ గూడఁగాను సతము లై తిమిగా.