ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 08-4 సామంతం సం: 10-045
పల్లవి:
వెలఁది నీ చెమటలె వెళ్ల వేయఁగా
తలఁగి నేఁ జెప్పకుంటే దాఁగఁ బొయ్యీనా
చ. 1:
సంగతి నీమోహ మెల్లా సకితోఁ జెప్పఁగఁ బోతే
అంగడిఁ బెట్టెకు మని ఆనవెట్టేవే
దొంగిలి గజ్జలపేరు తొలఁగఁ బెట్టెఁగఁ బోతే
వెంగలితనమె కాక వినక మానేరా
చ. 2:
యీకడ నీ విరహము యింతితో జెప్పఁగఁ బోతే
కాకుసేయ వద్దంటా కన్ను గీఁటేవే
పైకొని కన్నులు మూసి పాలు దాగఁబోతేను
జోకగా నింటివారు చూడక మానేరా
చ. 3:
జిగి విభుని దెమ్మని చెలులతోఁ జెప్పఁబోతే
అగడు సేయకు మని ఆన వెట్టేవే
నగుతా శ్రీవెంకటనాథుఁడె తా నిన్నుఁ గూడె
చిగిరింపుఁ గోరికల చేఁత డాఁగీనా.