ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 07-4 ఆహిరి సం: 10-039
పల్లవి:
ఎందు కెందుకు గడించీ యిది యేమె
మందలించినదె మారుమాఁట లవునటె
చ. 1:
చెనకి నన్నుఁ బట్టఁగ చెయి విదిలించితేను
కొనగోరు దాఁకినదె కొస రవునటె
పెనఁగి తనపై నానపట్టఁగానె లోఁగితేను
యెనసి తనచేతఁకు యియ్యకోలటె
చ. 2:
వువ్విళ్లూర నవ్వఁగాను వూరకె కోపము రేఁగి
పువ్వుబంతి వేసితేనె పొందవునటె
రవ్వగాఁ దా దూరఁగాను రాఁగతనానఁ దిట్టెక
అవ్వల సిగ్గువడితె అస లవునటె
చ. 3:
వెగ్గళించి తనుఁ దానె విడెము నా కియ్యఁగాను
దగ్గరి యందుకొంటేను తగు లవునటె
కగ్గు లేక శ్రీవెంకటనాథుఁడు గూడఁగ
అగ్గలమై కూడితేను ఆ లవునటె