పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0316-4 సౌరాష్ట్రం సంపుటం: 11-094

పల్లవి: కమ్మరఁ గమ్మరఁ జెప్ప కత లాయనే
         చిమ్ముల నీపతి వాఁడె చిత్తగించవే

చ. 1: చెక్కునఁ బెట్టినచేయి చెలువుఁ డింతలో రాఁగా
       అక్కజపు నీ సిగ్గు కడ్డ మాయనే
       తక్కక పయ్యదలోన దాఁచిన నీ కుచములు
       పుక్క టైన జక్కవల పోరు గాయనే

చ. 2: సెలవి నవ్విననవ్వు చేరి నీ పలుకులకు
        చలువ లై యడనెడ చవు లాయనే
        మెలుపున ముడిచిన మీ టైన నీతురుము
        పొలయు తుమ్మిదలకు పూఁ టాయనే

చ. 3: సేసెటి నీ విడెము శ్రీవెంకటేశు కూటమి
        వీసరపోక మంచివిందు లాయనే
        సేసపాల రతులలో చిప్పిలు నీ కెమ్మోవి
        రాసి కెక్కి చిగురులరచ్చ లాయనే