పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0316-1 శ్రీరాగం సంపుటం: 11-091

పల్లవి: ఏడ దాఁచుకుండెనో యి విందాఁకాను
         వాడుదేరె నీవు తనవద్ద నుండఁగాను

చ. 1: సెలవినవ్వులు గారె చెక్కులఁ గళలు దేరె
       మలసి చెలితో నీవు మాటలాడఁగా
       కలువకన్నులు విచ్చె కతలు చెప్పఁగఁ జొచ్చె
       పొలసి పొలసి నీవు బుజ్జగించఁగాను

చ. 2: పొంచినయాసలు రేఁగె పులకలు విఱ్ఱవీఁగె
       మంచముపై నుండి నీవు మన సియ్యఁగా
       ముంచి పైపైఁ జెమరించె మోహము నీ కొప్పగించె
       అంచెల మర్మముల నేఁడట్టె నీ వంటఁగాను

చ. 3: కమ్మరఁ జేతుల మొక్కె కాఁగిట నీకుఁ జొక్కె
       వుమ్మగిలురతులు నీ వొసఁగఁగాను
       యిమ్ముల శ్రీవెంకటేశ యిన్నిటాను నిన్నుఁ గూడె
       సమ్మతించి నీ విట్టె చన వియ్యఁగాను