పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0315-3 దేసాళం సంపుటం: 11-087

పల్లవి: ఎన్నడు నీ దయ మాపై నిఁకఁ బెట్టేవు
          తిన్నని యెడమాటలఁ దెల్లవార వచ్చెను

చ. 1: కొంగు వట్టినవాఁడవు గుట్ట గొంత నడుపేవు
       అంగవించి జాణవు గా వని యందునా
       చెంగట నిందరిలోన సిగ్గుపడి వుందానను
       వుంగిటి దీరనివేళ నూరడించ వలదా

చ. 2: చెక్కు నొక్కినవాఁడవు చెప్పవు ఆమీఁదిమాట
       లెక్కించి నీ ప్రేమ నాపై లే దందునా
       తక్కక యాపనులకె తలవంచుకుందానను
       అక్కరతో యీవేళ నాదరించ వలదా

చ. 3: యియ్యకొన్నట్టివాఁడవు యెదురు చేయి చాఁచేవు
       నెయ్యపు సరసములు నేర వందునా
       యియ్యెడ శ్రీవెంకటేశ యిందుకె కూడుందానను
       వొయ్యన నీ మన్ననల నోలలార్చ వలదా