పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0315-2 శంకరాభరణం సంపుటం: 11-086

పల్లవి: తెలుసుకో యిఁక నీవు తేటతెల్ల మిగ మమ్ము
         తలఁచుకో వారివంటిదాననె యింతనుండి

చ. 1: యిచ్చక మాడేటివారు యిన్నిటా నితవరులు
       నిచ్చ బుద్ది చెప్పేవారె నిష్టూరులు
       యెచ్చుకుంద లింతేసి యెరఁగ నైతి నిన్నాళ్లు
       తచ్చన నే వారితోదాననె యింతనుండి

చ. 2: మాయలు నేర్చినవారు మహిలోన జాణలు
        నాయాలు నడచేవారె నాలికూళలు
        బాయలుపందిలి వన్ని భ్రమించ నైతి నిన్నాళ్లు
        దాయగత్తెనై వారిలోదాననె యింతనుండి

చ. 3: గక్కన జంకించువారె కందువచనవరులు
        చిక్కి లోనై నవారె జిగి వెఱ్ఱులు
        యిక్కువ శ్రీవెంకటేశ యెనసితి నేఁడిన్నాళ్లు
        తక్కక నీవారిలోదాననె యింతనుండి