పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0314-4 రామక్రియ సంపుటం: 11-082

పల్లవి: ఇచ్చకుఁడ విన్నిటాను యే మంటివి
         యెచ్చరించే నింతె నిన్ను యే మంటివి

చ. 1: కాంత నిన్నుఁ దెమ్మనఁగఁ గాచుకున్నదాన నేను
       యింత వొద్దాయ నింక నే మంటివి
       చింతతో నెదురు చూచి సేసవెట్టె నంటా నీకు
       యెంత లేదు నీకు బని యే మంటివి

చ. 2: ఆకె నీకడ నున్న అంపఁగా వచ్చితి నేను
       యేకచిత్తమున నిట్టె యే మంటివి
       లేకలు నీకడ కంపె లేచి విచ్చేయఁగదవయ్య
       యేకతాన నప్పుడు నీ వే మంటివి

చ. 3: కొమ్మ లోననుండి వచ్చి కొంగు వట్టి నిన్నుఁ దీసె
        యిమ్ముల నీ మొగమాట నే మంటివి
        సమ్మ తై శ్రీవెంకటేశ సరుగఁ గూడితి రిదె
        యిమ్మనీ విడెము నిన్ను నే మంటివి