పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0314-3 బౌళి సంపుటం: 11-081

పల్లవి: చేతికి నీవు లోఁ గాఁగ జెప్పేఁ గాని
         యేతులఁ గుచ్చితా లుండె యిందాఁక నాకును

చ. 1: మంతన మాడితిని మగువతో నీ వప్పుడు
       పంతము లాడితెనే నీ పడఁతితోడ
       యింతలో నీవు రాఁగానె యేకచిత్త మాయఁ గాని
       దొంతర చలము లెక్కె తోడఁదోడ నాకును

చ. 2: చేతులు చాఁచితివ చెలియపై నీ వప్పుడు
        కాతరాలు రేఁచితి నా కాయములోన
        యీతలఁ జెక్కు నొక్కఁగా యియ్యకొంటి నేనన్నియు
        వాతులు మోవఁగఁ బొంగె వాసు లెల్ల నాకును

చ. 3: కన్నులచె మొక్కితివి కాంతకు నీ వల్లప్పుడు
       సన్నలఁ దిట్టితి నిన్ను సారెకు నేను
       అన్నిటా శ్రీవెంటకేశ అలమఁగ మెచ్చేఁగాని
       నున్ననిచెమట నిండె నొసలనె నాకునూ