పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0302-1 నాదరామక్రియ సంపుటం: 11-007

పల్లవి: చవులు వేరె వేరె సరసులకు వలపు
         యువిదలకుఁ బతుల కొక్కటే వలపు

చ. 1: కనుకలివేళను కలుగు నొక్కవలపు
       వినుకలిఁ బొడమేది వేరె వలపు
       అనఁగి పెనఁగేవేళ నదియు నొక్కవలపు
       వొనరినప్పు డిన్నియు నొక్కటే వలపు

చ. 2: సరస మాడెటివేళ సంగతౌ నొక్కవలపు
       సరి నెడమాటలది జంటవలపు
       తెరమరఁగున నుండి తేలించే దొకవలపు
       వొరసి మర్మ మంటితే నొక్కటే వలపు

చ. 3: వుపరతి సమరతి నుండు నొక్కవలపు
       యెపుడూనుఁ దలపోఁత లేకవలపు
       రప మై శ్రీవెంకటేశ రతి నన్నుఁ గూడితివి
       వుపమించి చూడ నింతా నొక్కటే వలపు