పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0301-6 రామక్రియ సంపుటం: 11-006

పల్లవి: దండ నుంటే గైకోఁడు దవ్వుల నుంటేఁ బైకొను
         చండి సేసేది అతని సాజమే కాదా

చ. 1: పెనఁగి కానకుంటేను పిలువ నంపు నని
       మొనసి నీతో నంటి మొదలే కాదా
       పొనిఁగి మీరు నాకు బుద్ది చెప్ప రాకు మని
       మనుపనె చెలులాల మొక్కిఁతి గాదా

చ. 2: మంకుతోడ నూరకుంటే మాటలాడించు నని
       అంకెల నీతో నవ్వితి నందుకే కాదా
       వంక లొత్తి మాకు మీరు వలపు రేఁచకు మని
       పొంకాన మీదాన నని పొందైతిఁ గాదా

చ. 3: యింటిలో నే నూరకుంటే యీడకే విచ్చేసు నని
       దంటనై సన్న సేసితి దానికే కాదా
       అంటుక శ్రీవెంకటేశుఁ డలమె దూరకుడని
       జంటై మీ సమ్మతినె చక్క నుంటిఁ గాదా