పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0313-5 సామంతం సంపుటం: 11-077

పల్లవి: ఇందరు నవ్వే దెరఁగ దెవ్వతో యీపె
         యెందు కైనాఁ దానె వచ్చీ నెవ్వతో యీపె

చ. 1: మచ్చికతో నీవు నేను మాట లాడఁగా విని
       యెచ్చు కుందు లెంచ వచ్చీ నెవ్వతో యీపె
       కుచ్చితాన తనలోన కోపము కొంత వెట్టుక
       యిచ్చట మెచ్చులు మెచ్చీ నెవ్వతో యీపె

చ. 2: నగుతా నిద్దరమును ననుపు నటించఁగాను
       యెగసక్యములు సేసీ నెవ్వతో యీపె
       తగవులు చెప్పుతాఁ గాఁతాళము గొంత రేఁచుక
       యెగుసనఁ బెట్టీ రేసు లెవ్వతో యీపె

చ. 3: నెయ్యపు శ్రీ వెంకటేశ నేఁడు మనము గూడఁగ
        యియ్యకొని పూఁకోనీ నెవ్వతో యీపె
        చయ్యాటా లిన్నియు మాని చవి సేసుక పొదిగి
        యెయ్యెడ నున్నదో తాను యెవ్వతో యీపె