పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0313-4 మాళవిగౌళ సంపుటం: 11-076

పల్లవి: చిత్తము వచ్చినప్పుడు చేర వచ్చే వింతే కాక
          యిత్తల నిందరిలోన నేమి బాఁతి నేను

చ. 1: చెక్కులు నొక్కెటివారు సేసలు వెట్టెటివారు
       యిక్కువ లంటెటివారు యెందురు నీకు
       వెక్కస మీ సందడిలో వేసరించఁ బోతేను
       యెక్కడి కెక్కు నావల పేమి బాఁతి నేను

చ. 2: ముచ్చట నుండెటివారు మొగము చూచెటివారు
        యిచ్చకా లాడెటివారు యెందరు నీకు
        పచ్చిగా నీమూఁకలలో పచరించఁ బోతేను
        యెచ్చటఁ గనేవు గురు తేమి బాఁతి నేను

చ. 3: కమ్ముక కూడెటివారు కాఁకలు చల్లెటివారు
        యెమ్మెలు సెరుపేవారు యెందరు నీకు
        దొమ్మిలో శ్రీవెంకటేశ తొల్లె నన్నుఁ గూడితివి
        యిమ్ములఁ జెయి వట్టెవు యేమి బాఁతి నేను