పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0313-3 భైరవి సంపుటం: 11-075

పల్లవి: చెచ్చెర నీవ్రతమే చెల్లెఁ గాక
         యిచ్చకురాల నేను యింకా నేడ సుద్దులు

చ. 1: చేసిన నీచేఁతలకు చెక్కు నొక్కేదానఁ గాక
       వేసరించి నిన్ను నంత వెంగె మాడేనా
       మూసినముత్యమువలె ముంగిటికి వచ్చితివి
       యీసులు నీతో నేల యింకా నేడ సుద్దులు

చ. 2: నానాటి నీగుణాలకు నవ్వు నవ్వేదానఁ గాక
       కాని మ్మని పగ చాటి కాఁక రేఁచేనా
      మోనాన నా యెదుటను మోహము చల్లెటి నీపై
      యేనెపము వెట్టఁగల నింకా నేడ సుద్దులు

చ. 3: గక్కనఁ గూడినందుకు కరఁగెటిదానఁ గాక
       యెక్కువతక్కువలు ని న్నెంచ వచ్చునా
       చిక్కితిని నాపాలికి శ్రీవెంకటేశ్వర
       యిక్కడనెవుండు నీవు యింకా నేడ సుద్దులు