పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0313-1 బౌళరామక్రియ సంపుటం: 11-073

పల్లవి: ముందటనె నిలుచుండి మొక్కేము గాక
         అందముగా మారుమాట లాఁడ గలమా

చ. 1: అంగన నీమోము చూచె నట్టె నీవు చూచితిని
       యింగితా లెరుఁగుదురు యిద్దరు మీరు
       చెంగట నుండినయట్టి చెలులము నే మెల్ల
       సంగ తెరఁగక మాటసరి తియ్యవచ్చునా

చ. 2: వనిత నీతో నవ్వె వడి నీవూ నవ్వితివి
       యెనలేని నేరుపరు లిద్దరూ మీరు
       పనులు సేసేయట్టి పడఁతులము మేము
       వెనక ముందటి మాట విన్నవించ వచ్చునా

చ. 3: సతి నిన్ను గాఁగిలించె సమ్మతించి కూడితివి
       యితవు లెరుఁగుదురు యిద్దరూ మీరు
       తతి శ్రీవెంకటేశుఁడ తగు మీవారము నేము
       మతకాన నిఁక మారుమాట లాడ వచ్చునా