పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0312-6 శ్రీరాగం సంపుటం: 11-072

పల్లవి: వలపు విసికితేను వాసన గద్దా
         చలము సాదించఁ బోతే చవి గావు పనులు

చ. 1: మచ్చిక నీతో నిట్టె మాటలాడినప్పుడె
       చెచ్చెర నీ పొందు నేఁ జేసినదాన
       కొచ్చి కొచ్చి నన్నేల కొంగు వట్టి తీసేవు
       వచ్చినదాననె యాల వడిఁబట్టె విఁకను

చ. 2: కన్నుఁగొనలను నిన్నుఁ గనుఁగొన్నయప్పుడె
       యిన్నిపనులకు నే నియ్యకొందాన
       మన్నించి యేకతములు మరి యేల చెప్పేవు
       విన్నదాననె తొల్లి వేసరించ కిఁకను

చ. 3: గక్కననె నిన్ను మెచ్చి కాఁగిలింనప్పుడె
       గుక్కక రతులలోఁ గూడినదాన
       యిక్కువ శ్రీవెంకటేశ యేలితివి నన్ను నిట్టె
       దక్కినదాననె తొల్లె దయఁ జూడు మిఁకను