పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0312-5 కన్నడగౌళ సంపుటం: 11-071

పల్లవి: నిన్చ నిచ్చా నా బదుకు నీచేతిది
         యిచ్చక మై యెందు కైనా నియ్యకొందు నేనూ

చ. 1: చెక్కు నొక్కినందుకె సేద దేరితిఁ గాక
       వెక్కసపుఁజింతతోడ వేగించనా
       గుక్కక నీ చేఁతలకు గోపము వచ్చునంతలో
       పక్కన వేఁడు కోంటేను పైపై లో నౌదును

చ. 2: చేయి వేసినందుకె సెలవి నవ్వితిఁ గాక
       చాయ సేసుక బొమ్మల జంకించనా
       మాయపు నీ గుణాలను మారుకొందు నంతలోనె
       ఆయములు నీ వంటితే నన్నియు మఱతును

చ. 3: కాఁగిలించుకొన్నందుకె కళల మించితిఁ గాక
       చేఁగ దేఁర దల వంచి చెమరించనా
       కాఁగి మాటల దూరుదు కరఁగుదు నంతలోనె
       ఆఁగి శ్రీవెంకటేశ నిన్నలమి నే మెత్తును