పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0311-3 దేసాక్షి సంపుటం: 11-063

పల్లవి: ఎంత మొగమాయకాఁడ వే మందు నిన్ను
         పంతము నెరపఁ బోయి పైకొంటి నేను

చ. 1: నే నిన్నుఁ గోపగించితే నీవు నవ్వితి వందుకు
       మోనాన నంతలోన నే మొక్కే నిదె
       ఆనుకొని మేటిదొర వన్నిటికి నేరుతువు
       కాని మ్మని యీ పనికె కరఁగితి నేనూ

చ. 2: అవ్వలిమోము నే నైతే నడ్డాలు వచ్చేవు నీవు
        మువ్వంక నే నిందుకుఁగా మొక్కే నిదె
        రవ్వ సేసి భోగించ రంటికి వత్తువు నీవు
       యివ్వల నీ వినయాల కియ్యకొంటి నేను

చ. 3: కడుగుట్టు నేఁ జేసితే కాఁగిలించుకొంటి విట్టె
       ముడిదీరె నిటమీఁద మొక్కే నిదె
       ఆడరి శ్రీవెంకటేశ అందగాఁడ కూడితిని
       జడియక మెచ్చి మెచ్చి సత మైతి నేనూ