పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0311-2 మలహరి సంపుటం: 11-062

పల్లవి: విన్నపము లిఁక నేల వేఁడుకో నేల
         చిన్ననాఁటి సిగ్గు లెల్ల చిమ్మి రేఁగె నిఁకను

చ. 1: మన్ననలకె మొక్కితి మాటలకే చొక్కితిని
       యిన్నేసి నిన్నుఁ దూరఁగ నిఁకఁ జోటేది
       అన్నిటా జూణవు నీవు ఆయము లెఱుఁగుదువు
       పన్నిన నా జవ్వనము ఫలియంచె నిఁకను

చ. 2: నవ్వులనె తనిసితి నయాలనే మొనసితి
       యెవ్వరు నేమి చెప్పేరు యెడసుద్దులు
       నివ్వటిల్లు విటుఁడవు నిజ మాడ నేరుతువు
       రవ్వ లైన నాభాగ్యము రతి కెక్కె నిఁకను

చ. 3: ముచ్చటఁ దొప్పఁ దోఁగితి మోహాన విఱ్ఱవీఁగితి
       వచ్చె నాపంతము లెల్ల వాసు లేఁటివి
       యిచ్చట శ్రీవెంకటేశ్వర యిట్టె నన్నుఁ గూడితివి
       మెచ్చిత మొదలు నిన్ను మే లాయ నిఁకమ