పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0310-5 కాంబోది సంపుటం: 11-059

పల్లవి: చలములు మాని అన్నీఁ జవి సేసుకోంటిఁ గాక
         తెలివి మొగముననుఁ దేరునా వొరులకు

చ. 1: చిత్తము నొవ్వకుండ చేతుల మొక్కితిఁ గాక
        యిత్తల నీ చేసేచేఁత లెన్ని లేవు
        వత్తివలె వాడక నీవద్దఁ జెలఁగేఁ గాక
        కొత్తలుగ మోము చూడఁ గొలుపుగా యిందుకు

చ. 2: కాఁకలు రేఁగకుండఁగ గానుక లిచ్చితిఁ గాక
       యేఁకట నీ పొరపొచ్చే లెన్ని లేవు
       ఆఁకలు సేయక నీకు నట్టే నే లో నైతిఁ గాక
       పూఁకొన నైన రతికి నుద్యోగము వుట్టునా

చ. 3: తగవులు దప్పకుండ దయతోఁ గూడితిఁ గాక
        యెగసక్యాలు నీ వైతె నెన్ని లేవు
        ఆగవడి శ్రీవెంటాధిప కూడితి నన్ను
        వెగ టైన యిందుమీఁదు వేసటలు వుట్టునా