పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0310-2 దేశాక్షి సంపుటం: 11-056

పల్లవి: ఇంతేసి దొరపొందు యెందుకు నైనా వచ్చు
         చింత దీర నా మనసు చెలఁగించవయ్యా

చ. 1: పలుమారు నీతోను పలచఁగా నే నవ్వితే
       యెలమి నీ చిత్త మిఁక నెట్టుండునో
       పిలువఁగ నీతోను బిగిసి వూరకుండితే
       అలరి కైకొనని అదియు నెట్టుండునో

చ. 2: పిక్కటిల్ల నీతోను బెరసి మాటలాడితే
       యెక్కువ తక్కువలందు నెట్టుండునో
       వక్కణించగా నీతో వడి గుట్టున నుండితే
       అక్కజపు గర్వమని అదియు నెట్టుండునో

చ. 3: కదియఁగ నీతోను కడు నేఁ గొసరితేను
       ఇదె శ్రీవెంకటేశ నేఁ డెట్టుండునో
       పొదిగి కూడితి వింకఁ బూఁచి సిగ్గు వడితేను
       అదను గా దని సంత మదియు నెట్టుండునో