పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0309-6 రామక్రియ సంపుటం: 11-054

పల్లవి: ఈపాటివాఁడవా యిస్సీ నీవు
         యేపున నీ దీమసము యేడ నుండె నపుడూ

చ. 1: ఆయము సోఁకినమాట లాపె నీతో నాడఁగాను
       కాయ మెల్లఁ గరఁగేవు కాక దేరఁగా
       యీయెడ‌ వద్ద నున్నవా రెవ్వ రవుతా నెరఁగవు
       చేయి వట్టి తియ్యఁగానె సిగ్గు వడే విపుడు

చ. 2: చిప్పిల సెలవులను చెలి యట్టె నవ్వఁగాను
       తప్పక చూచే వక్కడె దైవారుతా
       చెప్పి చెప్పి నిన్ను గోరఁ జిదిమినా నెరఁగవు
       కొప్పువట్టి తయ్యఁగా కొంకి లోఁగే విపుడు

చ. 3: చెక్కు నొక్కి సతి నీ సేవ లెల్లఁ జేయఁగాను
       మిక్కిలి లోలుఁడ వైతి మేర మీరఁగా
       కక్క సించి నేఁ గూడితె గక్కన శ్రీ వేంకటేశ
       మొక్కుచు నాతో నింతలో ముచ్చటాడే విపుడు