పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0309-3 భైరవి సంపుటం: 11-051

పల్లవి: నీవు మంచవాఁడవె నే నెట్టుండితి నేమి
         యీ విధము లెరఁగక యెడ్డదాన నైతిని

చ. 1: నిండిన నీతలపోఁత నే నెరఁగఁగా నావద్ద
       నుండఁగా నావాఁడ వని వుంటిఁ గాని
       యెండమావులనీళ్లు యేరు లంటా నుండి నట్టు
       కొండవంటి యాసచేత కూళదాన నైతిని

చ. 2: పంతాలు నే నెరఁగఁగా పలుకక నీ వుండఁగ
        అంతలో నా కెదురాడ మాని వుంటిని
        బంతినె తెల్లని వెల్లఁ బాలంటా చవి గొన్నట్టు
        రంతులబాసలు నమ్మి రాఁపుదాన నైతిని

చ. 3: నీ మోహము లెరఁగఁగా నిక్కము నాకు మొక్కఁగ
       అముకొని యెగసక్యా లని వుంటివి
       చేముంచి శ్రీవెంకటేశ చెఱకున పండున్నట్టు
       కామించి నీవుర మెక్కి ఘనురాల నైతిని