పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0309-1 మంగళకౌశిక సంపుటం: 11-049

పల్లవి: విచ్చేయు మాయింటి కిట్టె వింతవాఁడవా
         వచ్చిదేరెఁ బను లెల్ల పైపై నీవల్లనే

చ. 1: యిచ్చక మై యుండేవాడ వెగ్గు లేల పట్టేవు
       నచ్చుల నే తిట్టినాను నవ్వవలెఁ బో
       చెచ్చెర నా కెల వలచితి నని యందువు
       యెచ్చు కుందు లాయ మాట యిదివో నీ వల్లనే

చ. 2: చుట్టము వైనాఁడవు సోలి చిన్నఁ బో నేల
        అట్టె నే రాకు మనిన నంటవలెఁ బో
       దట్టముగ నాకుఁగా వ్రతము వట్టితి నందువు
       వెట్టిపొందు లెల్లాను వెలసె నీవల్లనే

చ. 3: తగులు గలవాఁడవు తడఁబాటు లిఁక నేల
       మొగము నేఁ జూచిలేను మొక్కవలెఁ బో
       నిగిడి శ్రీవెంకటేశ నీవు నేనుఁ గూడితిమి
       తెగనిమహిమ లెల్లఁ దెలినె నీవల్లనే