పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0301-4 సాళంగం సంపుటం: 11-004

పల్లవి: ఆవధరించవయ్య అనుమాన మిఁక నేల
         చివురుఁజేతులనె సేసెవెట్టీ నిదివో

చ. 1: కాంత మోవివిందు వెట్టి కన్నులనవ్వుఁజూపుల
       వింతలుగ గప్పురపువిడే లిచ్చి
       పొంతనె సరసముల పువ్వుబాసికేలు గట్టి
       చింత దీర చెనకుల సేస వెట్టీ నిదివో

చ. 2: పక్కనఁ దనతొడలఁ బానుపు వరచి నీకు
       గక్కన మోహా లనేకట్నా లిచ్చి
       వెక్కసపుఁ దమకాల వియ్యము లట్టె యంది
       చిక్కని చనుగుబ్బలనేస వెట్టీ నిదివో

చ. 3: దొమ్మిఁ గాఁగిటనే గురుతుల సొమ్ము లెల్ల నించి
       నెమ్మది నానందముల నెలవుకొని
       కొమ్మ శ్రీవెంకటేశుఁడ కూడె నిన్ను మేడలోన
       చిమ్ముఁజెమటల ముత్తేలసేస వెట్టీ నిదివో