పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0308-3 పాడి సంపుటం: 11-045

పల్లవి: మాన వెప్పుడును నీ మాయ లెల్లాను
         నానిన నా ననుపులు నవ్వించీఁ గాని

చ. 1: వాలుకరెప్పలు నీపై వంచి నే నెంత లోఁచినా
       తాలిమె చూపుదు గాక తత్తరించేనా
       వాలాయించి రాతిగుండెవాఁడ వౌత యెఱుఁగుదు
       పాలుమాలిన నా యాస పాయ నీదు గాని

చ. 2: ఆయములు సోఁక మాటలాడి యంత కొసరిన
       చాయకాఁడవె కాక సమ్మతించేవా
       కాయకపు నీసరిత గట్టిగా నే నెరుఁగదు
       పాయపు నా వేడుకలు పై కొలిపీఁ గాని

చ. 3: చిమ్నుచు నీ కాఁగిటిలో చేత లెంత నేసినాను
        కుమ్మరించి నాతోను నీ గుట్టు చెప్పేవా
        కమ్మటి శ్రీవెంకటాద్రి కడపరాయఁడవై
        నెమ్మది గూడితి విదె నిజమూయఁ గాని