పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0308-2 నాదరామక్రియ సంపుటం: 11-044

పల్లవి: ఏమయ్య నీ దొరతన మిటువంటిదా
         నీ మనసు నాపై బత్తి నే నెరగనా

చ. 1: ఆపె నిన్ను వెడమాట లాడఁగాను విని నీవు
       యేపున నూరకుండితి వేమయ్య
       నీ పొందు లిటువంటివా నిన్నిందరుఁ గనరా
       వో పో నమ్నినదాని నొప్పగింతురా

చ. 2: వోరతోడ నాపె సేసే వుద్దండా లెల్లాఁ జూచి
        బీరాన నీవు వచ్చి పెనఁగ వద్దా
        నేరపు లేనివాఁడవా నీ వెరఁగవా యిన్ని
        కోరి నీవే గతి యంటే కూడుక రావలదా

చ. 3: పొంచి యాపె చేసేసుక పోఁగా నేఁ డా గర్వ మెల్ల
       తుంచి వేయకుంటె నది దోసము గాదా
       మించి శ్రీవెంటేశుఁడ మే లిచ్చి నన్నుఁ గూడితి
       తెంచి నా పగ లన్నియుఁ దీరిచితి విపుడు