పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0308-1 మాళవి సంపుటం: 11-043

పల్లవి: ఇందుకుఁగా వట్టి వాదు లిఁక నీతో నేలయ్య
         పొందు లెల్లఁ జేకొంటిమి పొద్దున రావయ్యా

చ. 1: నీచేత మాటలకు నీకన్నుల తేటలకు
       యేచి లోనైనవారికి నేల కోపము
       పూచినట్టె వుండుఁ గాని పున్నమినాఁటివెన్నెల
       చూచితేఁ బువ్వులు లేవు సోద్య మింతే కాని

చ. 2: సేసేటి నీ మేకులకు సెలవుల నవ్వులకు
       ఆసపడ్డవారము మా కలు కేఁటికి
       పూసినట్లనె వుండు పుప్పొడి పై రాలితేను
       వోసరి గందమువలె వొళ్ల నేమ నంటదు

చ. 3: నిక్కపు నీ సేసలకు నిండిన నీ కాఁగిటికి
        చిక్కినవారము మాకు చింత లేటికి
        యిక్కువ శ్రీవెంకటేశ యేక మైతివి వలపు
        లెక్కకు వచ్చినట్టుండు లేదు మితి మేరా