పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0307-4 సాళంగం సంపుటం: 11-040

పల్లవి: నీవు నాతఁ డొక్కటె నేము నీవారమె
         వోవరి లోననే వుండి వొడఁబా ట్లేఁటికే

చ. 1: మొక్కిన నీ మొక్కు లెల్ల మొదలి పెండ్లివిడేలు
       చిక్కని నీనవ్వులె నేసపాలు
       తక్కినసుద్దు లేఁటికి తగు లాయఁ బను రెల్ల
       యిక్కడి కక్కడి కింక నెడమాట లేఁటికే

చ. 2: చూచినచూపులు నీకు చుట్టుపుసమ్మంధాలు
        తాచినగంధాక్షతలు తలపోఁతలు
        చేచేత మీ కిద్దరికి చేసిన చేఁతలు దక్కె
        యేచ యిందరునుఁ జెప్పే యియ్యకో ళ్లేఁటికే

చ. 3: కలసినకలయిక కందువసోబనములు
        పలుసంతసాలె మీ మీ బాసికాలు
        యెలమి శ్రీవెంకటేశు నిటు నీవె కూడితివి
        యెలయింపుఁ జెలులచే నెగపోఁత లేఁటికే