పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0307-3 ముఖారి సంపుటం: 11-039

పల్లవి: అందరుఁ జెప్పేరు విను అది దగవా
         యిందరిలో బొంకను నీ కిది దగవా

చ. 1: చేరి గొల్లెతలు నీతో చీఁకటితప్పు సేసితే
       ఆరితేరి నవ్వితివి అద దగవా
       చీరలు దీసితి వట చేరి కొలనిదరిని
       యీరీతి నింతటిదొర విది దగవా

చ. 2: చెలఁగి వుట్లపై దాఁచిన వెన్నలునుఁ బాలు
        అలమి ఆరగించితి వది దగవా
        కలపితి వట వారికట్టినదూడల నాల
        యిలపై నీ వుద్దండాలు యింత దగవా

చ. 3: చక్కిలాలు నురుగు సతులు దాఁచిన వెల్ల
        అక్కరఁ గైకొంటి మాట అది దగనా
        గుక్కక శ్రీవెంకటాద్రికోమలపుకృష్ణుఁడవై
        యెక్కి వేసాలు సేసే విది దగవా