పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0306-3 వరాళి సంపుటం: 11-033

పల్లవి: అంత సేసినవాఁడవు పంత మీవయ్య
         చెంతల నీకుఁ బ్రియము చెప్ప దిదివో

చ. 1: చెక్కులు నొక్కిననొక్కు చిత్తమెల్లఁ బులకించి
       మక్కువకామిని నీతో మాట లాడదు
       అక్కడ నవ్విననవ్వు ఆయ మెల్లఁ గాఁడి పారి
       చొక్కుచు నిన్నుఁ దప్పక చూడ దిదివో

చ. 2: సరస మాడినచేఁత సందుసందులనుఁ జిక్కి
       వొరయుదు చన్నుల ని న్నూరికె చెలి
       యిరవుగాఁ జూచినచూ పెదలోనఁ బాయదు
       తెరమరఁ గెంతైన దియ్య దిదివో

చ. 3: బిగియించిన కాఁగిట ప్రియముల తల కెక్కి
       వెగటుసంతోసముల విఱ్ఱవీఁగీని
       నిగిడి శ్రీవెంకటేశ నీ వింతలోఁ గూడఁగాను
       తగిలిన రతులకె తమకించీ నిదివో