పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0306-2 రామక్రియ సంపుటం: 11-032

పల్లవి: చిత్తగించు నీకు నేఁ జెప్పినదాననా
         యిత్తల నంతేసి నీ వెఱఁగనివాఁడవా

చ. 1: నీవు మన్నించదాన నీకు వలచినదాన
       యీవల నల్లది నాతో యీడుజోడుదా
       వావాత నావాదు నీవు వహించుకో కుంటేను
       చేవలు మీరి నిన్ను మోచినదాఁకా రాదా

చ. 2: సేస వెట్టితిని నీవు చేయి చాఁచితి నేను
       వాసితో నల్లది నాతో వంతు వచ్చేదా
       బాసతో నాకుఁగా నీవు పట్టి పెనఁగ కుండితే
       ఆసల నాస లని అందాఁకా రాదా

చ. 3: దక్కితివి నీకు నాకు తగు లైతి నే నీకు
       మొక్కక అల్లది నాతో మొన చూపేదా
       యిక్కువఁ గూడితివి నన్నిట్టె మెరయించకుంటే
       నిక్కి శ్రీవెంకటేశ్వర నిన్ను ముట్టి రాదా