పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0306-1 దేసాళం సంపుటం: 11-031

పల్లవి: మాతో నేల తన కింత మచ్చరాలు నీవె
         పోతరించినయాపెకు బుద్దిచెప్ప రాధా

చ. 1: పక్కన నీతో నేను పదరి నవ్వితి నంటా
       అక్కడనుండె సణఁగు లాపె ఆడీని
       తక్కి చలిమి బలిమి తన కింత గలితేను
       చిక్కించుక నిన్నేమైనాఁ జేయఁగ వలెఁబో

చ. 2: మంచముపై నీవు నేను మరిగి వున్నారమని
        యించుకంత చూడ నోప కీసడించీని
        నించి తన కంతేసి నేరుపే కలిగితేను
        అంచల నిన్ను రప్పించి అదలింవలెఁ బో

చ. 3: కందువ నీవు నన్నుఁ గాఁగిట గూడితి వంటా
       చెంది లోలోనే తాను చిన్నఁ బోయ్యిని
       యిందుకు శ్రీవెంకటేశ యిన్నిటా తా జా ణైతేఁ
       బొంది యిచ్చకము నేసి పొదుగఁగ వలెఁబో