పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0305-5 పాడి సంపుటం: 11-029

పల్లవి: ఇంకా నేల నాచేతి యెడమాటలు
         అంకెకు వచ్చున్న వాఁడు ఆడనె నీ వాడవే

చ. 1: తుచ్చము లే మాడితవో దూరు లెంత దూరితవో
       ముచ్చట దీరఁ బతికి మొక్కవే నీవు
       పచ్చిగా నీ మంచముపై పవళించి వున్నవాఁడు
       యిచ్చకపుప్రియములు యేకతానఁ జేయవే

చ. 2: యే మని చెప్పించితివో యెంతేసి పెనఁగితివో
       మోము చూచి వొక్కమాటు మొక్కవే నీవు
       చే ముట్టక నీవద్దనె సిరసు వంచుకున్నాఁడు
       కామించి యాతనిమతి కరఁగించఁగదవే

చ. 3: నవ్వులేమి నవ్వితినో నాలి యెంత సేవితివో
        మువ్వంక నందుకుఁ దగ మెక్కవే నీవు
        యివ్వల శ్రీవెంకటేశుఁ డిరవుగ నన్నుఁ గూడె
        రవ్వలు సేయక లోలో రతుల మొప్పించవే