పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0301-2 పాడి సంపుటం: 11-002

పల్లవి: ఏమి బాఁతి నే నీకు యిటు నాకె దక్కితిని
         దోమటి నిందుకె పో నీ తొత్త నైతి నేను

చ. 1: మన్నించి విచ్చేసితివి మా యింటికి నేఁడునీవు
       కన్నుసన్న నేసితేనె కా దన వైతి
       పిన్నదాన నవక నా ప్రియమె చేకొంటివి
       యిన్నేసి నావలపుల కెల్లా లోనైతివి

చ. 2: తప్పక చూచినంతలో దగ్గరి కూచుండితివి
       కప్పురవిడె మిచ్చితేఁ గైకొంటివి
       చెప్పినట్టల్లాఁ జేసి చేఁతలకు గురైతివి
       యిప్పుడు నా యంకెలకు యియ్యకో లైతివి

చ. 3: గక్కనఁ గాగిలించితే కన్నులు దేలించితివి
        పక్కన నా రతులకు భ్రమసితివి
        యిక్కువ శ్రీవెంకటేశ యిందునె నన్ను గూడితి
        మిక్కిలి నాయెడ కూనుమేలువాఁడ వైతివి