పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0305-3 కాంబోది సంపుటం: 11-027

పల్లవి: ఎవ్వరీ బుద్దులు విన రెందాఁకాను
         యివ్వల జాగరా లున్నా రెందాఁకాను

చ. 1: చక్కెరమోవులు వాడె సరసములలోననె
       యెక్కడి ఆలుకలు మీ కెందాఁకాను
       ముక్కున నూర్పులు రేఁగె ముట్టీముట్టుక తొల్లె
       యిక్కువ పంతములు మీ కెందాఁకాను

చ. 2: కన్నులఁ గావులు గప్పె కందువనవ్వులలోనె
       యెన్నేసి వొట్లు వెట్టే రెందాఁకాను
       తన్నుఁ దానె చెవరించె తనువుల నిద్దరికి
       యిన్నిటా మీ మతకము లెందాఁకాను

చ. 3: మోమునఁ గళలు రేగె ముంచినసిగ్గులలోనె
        యేమిటికి ననుమానా లెందాఁకాను
        వేమారుఁ గూడితిరి శ్రీవెంకటేశుఁడును నీవు
        యీ మాట లందరుఁ జెప్పే రెందాఁకాను