పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0305-2 దేసాక్షి సంపుటం: 11-026

పల్లవి: ఇతరులే మెరుగదు రేమని చెప్పఁగ వచ్చు
         పతులకు సతులకు భావజుఁడే సాక్షి

చ. 1: తలఁపు గలిగితేను దవ్వు లేమి నేరు వేమి
       అలరి సమ్మతించితె నడ్డాఁక లేమి
       కొలఁది మీరినప్పుడు కొంచ మేమి దొడ్డ యేమి
       నెల విచ్చి యేకతానఁ జేసినది చేఁత

చ. 2: యిచ్చకమె కలిగితే యెక్కు వేమి తక్కు వేమి
       హెచ్చినమోహములకు నెగ్గు సిగ్గేది
       పచ్చి యైనపనులకు పాడి యాల పంతమేల
       చెచ్చెరఁ దమకుఁ దాము చెప్పినది మాట

చ. 3: అన్నిటా నొక్కటియైతే నైన దేమి కాని దేమి
       యెన్నికల కెక్కితేను యీడు జోడేది
       వున్నతి శ్రీవెంకటేశుఁ డొనగూడె నేర్పు లివి
       కన్నెలుఁ దాఁ గూడిన గతులే సంగతులు