పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0304-3 సామంతం సంపుటం: 11-021

పల్లవి: ఊడిగపువారము నీ కొప్పించేము లోనిమాట
         వేడుకఁ దెలుసుకొమ్మీ వేరె వేరె నీవు

చ. 1: చిలుకలు వలికీని చెవి యొగ్గి వినవయ్య
       కలువలు వికసించెఁ గై కోవయ్య
       చెలిమి సేసీఁ దీగెలు చేత నందుకొనవయ్య
       వెల నీకుఁ జెప్పరాని విన్నప మిదయ్యా

చ. 2: జక్కవలు మెదలీని సరవులు చూడవయ్య
       నిక్కెను మేఘ మదివో నీ వంటవయ్య
       మిక్కి లద్దాలు మెరిచీ మించి నీడ చూడవయ్య
       వెక్కసపు గుట్టుతోడి విన్నప మిదయ్య

చ. 3: వెన్నెల గాసీఁ జంద్రుఁడు వెలయఁగ మెచ్చవయ్య
        సన్నల మోవిపండు చవి గొనవయ్య
        నిన్ను శ్రీవెంకటేశుఁడ నీరాణివాసము గూడె
        వెన్నవంటి మెత్తని విన్నప మిదయ్యా