పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0304-2 మంగళకౌశిక సంపుటం: 11-020

పల్లవి: చేసినంతే చేఁతగాక చెలు లెల్లా నీపట్టుకు
         తాసువలె మెలఁగితే తగ వెఱిఁగేవా

చ. 1: వద్దనుండి నీ కాపె వలపులు రేఁచఁగాను
       బుద్ది చెప్పితే వినేవా పొరుగువారు
       వుద్దండాననె నిన్ను వొడివట్టి తియ్యఁగాను
       కొద్ది నుంటి వింతే కాక గుణ మెరిఁగేవా

చ. 2: నలుగడ నాకె నీతో నవ్వు లట్టె నవ్వఁగాను
       పిలిచినాఁ బలికేవా పెరవారు
       చలము సాదించి నిన్ను సరిఁ గాఁగిలించు కొఁగా
       కలయ వచ్చేవు గాక కరఁగేటి వాఁడవా

చ. 3: రతులచవులు చూపి రచ్చ నిన్ను వేయఁగా
       యితవు సేసితేఁ జవులా యింటివారు
       మితి మీరి నేఁ గూడఁగ మెల్లనె శ్రీవెంకటేశ
       తతిఁ జేకొంటివి గాక తగిలేటివాఁడవా