పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0304-1 లలిత సంపుటం: 11-019

పల్లవి: ఇంక నేఁటి బిగువు యేల నీకును
         వంక లొత్త నొరగులౌ వాసిమీఁదను

చ. 1: తిలకించి నీచేఁతకు తిట్టు కేల మానును
       చలిమి బలిమిఁ గల జవరాలు
       అలుగ నీకుఁ దగదు ఆయములు సోఁక నాపె
       ఆలమి లోనికి దీసె నందుమీఁదను

చ. 2: చెనకే నీ మాటలకు చేయి చాఁచ కేల మాను
       మనసు మర్మము గన్న మదిరాక్షి
       పెనఁగ నీకు దగదు ప్రేమములు రేఁగ నాపె
       అనువుగగా కళ రేఁచె నందుమీఁదను

చ. 3: కూడిన నీకూటమికి కొన కెక్క కేల మాను
       సూడుఁ బాడు నెరింగిన సుదతీమణి
       యీడనె శ్రీవెంకటేశ యెనసి నిన్నిదె యాపె
       ఆడుకోలు చెల్లించె నందుమీఁదను