పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0303-3 పాడి సంపుటం: 11-015

పల్లవి: ఊరకుండవయ్యా నీవు వువిదతో మారాడక
         ఆరయ నొచ్చము లేదు అంగనల కెపుడు

చ. 1: యే మాడిన నాఁటదాని కెగ్గులేదు తప్పు లేదు
       నేమాన నూరకుండిన నేరమి లేదు
       దోమటిగాఁ జూచినాను దొరతన మై తోఁచు
       వేమారు నవ్విన నవి వేడుకలై నిలుచు

చ. 2: తల వంచుకుండినాను తగ్గు లేదు మొగ్గు లేదు
        పలుకక వుండినాను భయము లేదు
        బలుములై చూపినాను పంతము లై రతి కెక్కు
        పెలుచుఁజేత సేసినా ప్రియము లై తగులు

చ. 3: మించి కాఁగిటఁ గూడిన మితి లేదు మేర లేదు
        యించుక గుట్టున నున్న యెరవె లేదు
        అంచల శ్రీవెంకటేశ అంగనఁ గూడితి విట్టె
        మంచముపైఁ గూచుండిన మర్మము లై మించును