పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0302-6 కేదారగౌళ సంపుటం: 11-012

పల్లవి: వెలఁది నీరతుల వీఁగ దిఁక
         నిలవున నెమ్మెలు నెరపకు వయ్యా

చ. 1: పలుమరు నీతో పంతము లాడఁగ
       చెలియకుఁ గచుములు చేఁ గెక్కే
       చలమునఁ బై కొని సాములు సేయఁగ
       మొలకలపులకలు మొన లాయ

చ. 2: సరసము నీపైఁ జల్లఁగ జల్లఁగ
       వరుస గోరికొన వాఁ డెక్కే
       సరుగఁ గూరిమి గొసరఁగఁ గన్నుల
       నిరతపు మెఱుఁగులు నిండె నవే

చ. 3: వొప్పుగ మేనులు వొరయఁగ మీకును
       చిప్పిలుఁ జెమటల చితు కెక్కే
       అప్పఁడ శ్రీవెంకటాధిప కూడితి
       కప్పురగందికి కళ లవె మించే