పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0302-4 మధ్యమావతి సంపుటం: 11-010

పల్లవి: కాంతలకుఁ బతులకు కల సాజమె యిది
         వింతదాననా నీకు వెర పేలమ్మా

చ. 1: కందువకు దీసేది కన్నుల నదలించేది
       యిందరికి గలదె యే మమ్మా
       యిందుకుఁగా నాతఁడు యెగ్గు వట్టీనా నిన్ను
       విందుల వెరపు చల్లీ వెర పేలమ్మా

చ. 2: పెనఁగితేఁ దిట్టేది బెరసితే మెచ్చేది‌
       వనితల కీపాటి వలె నమ్మా
       చన విచ్చె నాతఁడు సలిగె గలదు నీకు
       వెనక ముందరి కింక వెర పేలమ్మా

చ. 3: కూడి యిట్టె చొక్కేది గురుతులు నించేది
       పాడి పంత మెక్కె నీకు పైపై నమ్మా
       వోడక శ్రీవెంకటేశుఁ డురమున బెట్టె నిన్ను
       వేడుకకు వెల లేదు వెర పేలమ్మా