పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0315-04 ముఖారి సం: 04-087 నామ సంకీర్తన


పల్లవి :

ఇందులోనఁగల సుఖమింతే చాలు మాకు
నిందు వెలియైన సిరులేమియు నొల్లము


చ. 1:

ఆదిదేవు నచ్యుతు సర్వాంతరాత్మకుని
వేదవేద్యుఁ గమలాక్షు విశ్వపూర్ణుని
శ్రీదేవు హరి నాశ్రిత పారిజాతుని
అదిగొని శరణంటి మన్యము నేమొల్లము


చ. 2:

పరమాత్ముఁ బరిపూర్ణు భవరోగవైద్యుని
మురహరు గోవిందు ముకుందుని
హరిఁ బుండరీకాక్షు ననంతు నభవుని
పరగ నుతించితిమి పరుల నేమొల్లము


చ. 3:

అనుపమ గుణదేహు నణురేణు పరిపూర్ణు
ఘనుఁ జింరంతనుని కలిభంజను
దనుజాంతకుని సర్వధరు శ్రీవేంకటపతిఁ
గని కొలిచితిమి యేగతులు నేమొల్లము