పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0315-03 శంకరాభరణం సం: 04-086 వైష్ణవ భక్తి


పల్లవి :

పరమవైష్ణవుల భాగ్యంబిదివో
నిరతి వారలకే నే మొక్కెదను


చ. 1:

తలఁచ రొకప్పుడు ధరణి భోగములు
తలఁచ రితరమతదైవముల
తలఁతు రొకటి హరిదాసులదాస్యము
తలఁపు మోక్షములతగులమిగాన


చ. 2:

కోరరు బ్రహ్మదిగురుతరపదములు
కోరరు మేరువుకొనసుఖము
కోరుదురు తదియ్య కోట్ల సంగము
కోరిక భక్తితోఁ గూఁడీగాన


చ. 3:

వొల్లరు కర్మము లొల్లరు పుణ్యము
లొల్లరహంకార మొకపరియు
పుల్లము శ్రీవేంకటోత్తము శరణని
యెల్లందుఁ దుదిపద మొక్కిరిగాన