పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రేకు: 0315-05 వరాళి సం: 04-088 శరణాగతి


పల్లవి :

హరికే మొఱపెట్టు టంతేకాక
గరిమ వేరోకటను గతి గానవచ్చునా


చ. 1:

పాపపుణ్యాలంపటాలఁ బరగిన జీవునికి-
నోపననవచ్చునా వొడలి మోపు
కోపపు శాంతము చేతఁ గొట్టువడ్డప్రాణికి
తాపపు కర్మపువెట్టి తప్పంచుకోవచ్చునా


చ. 2:

ఆఁకటి నీరువట్టుల కగపడ్డదేహికి
తోఁకసంసారపుటాజ్ఞ తోయవచ్చనా
సోఁకుసుఖదుఃఖములఁ జొచ్చినజంతువునకు
మూఁకల లోకపులగ్గములఁ బాయవచ్చునా


చ. 3:

సారె రాత్రిఁ బగటాను చచ్చిపుట్టేజంతువుకు
భారపుటాసల లోనఁ బాయవచ్చునా
యీరీతి శ్రీవేంకటేశు నిటు శరణన్నఁగాక
ధారుణిఁ బంచబాణము దప్పుకొనవచ్చునా