పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/605

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9116-03 శ్రీరాగం సం: 04-601 విష్ణు కీర్తనం

పల్లవి:

ఇందిరకు నురము మీఁదిచ్చిన నాఁడు
విందువలె హరి యిందు విచ్చేసె నాఁడు

చ. 1:

పరమపదమునందు బహుదివ్యవరణాలు
హరి గరిమలు పొలువలరు నాఁడు
గరుడఁడు నసంతుఁడుఁ గదిసి సేనేశుఁడు
హరి నిత్యసేవకులై రిందు నాఁడు

చ. 2:

పాల జలధిలోనఁ బవళించి హరి వచ్చి
భూ లోకమింతయుఁ జూచి పొగడునాఁడు
పాలించి నేలయు మిన్ను బహు దివ్య దేశాలు
గాలించి కోనేటిదరి గైగొంట నాఁడు

చ. 3:

నరసురోరగులెల్ల నలువంకఁ గొలువంగ
పురవైన వేడుకలఁ బొదలునాఁడు
విరజానదియుఁ దాను వేంకటపతి వచ్చి
పరమపద మిదని పాలించె నాఁడు