పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9084-03 దేశాక్షి సం: 04-589 వేంకటగానం

పల్లవి:

కంటి నఖిలాండ కర్త నధికుని గంటి
కంటి నఘములు వీడుకొంటి - నిజమూర్తిఁ గంటి

చ. 1:

మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి
బహువిభవముల మంటపములు గంటి
సహజ నవ రత్న కాంచన వేదికలు గంటి
రహి వహించిన గోపురంబులవె కంటి

చ. 2:

పావనంబైన పాప వినాశనము గంటి
కైవశంబగు గగన గంగ గంటి
దైవికపుఁ బుణ్య తీర్ధములెల్లఁ బొడగంటి
కోవిదులు గొనియాడు కోనేరిఁ గంటి

చ. 3:

పరమ యోగీంద్రులకు భావగోచరమైన
సరిలేని పాదాంబుజములు గంటి
తిరమైన గిరి చూపు దివ్యహస్తము గంటి
తిరు వేంకటాచలాధిపుఁ జూడఁగంటి