పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9084-02 వరాళి సం: 04-588 వేంకటగానం

పల్లవి:

దిక్కులేకపోయే నిట్టే దినదినము
వెక్కసపు లోకమేలే విభుఁడెవ్వడో

చ. 1:

గుత్తముగ నెల్లవారు కుడిచేటి కంచము
ఎత్తుక లోఁబెట్టుకొనె నెవ్వఁడో దొంగ
కొత్తగానే యింతి గట్టుకొని బయటవేసిన
మెత్తనిదంటాఁ బట్టు మింగె నెవ్వడో

చ. 2:

బంతిగాఁగ నెల్లవాఁరు పండేటిమంచము
గుంతలో విరుగఁదోసె గూళఁడెవ్వడో
దొంతుల కడవలోన తొరలి దాఁచిన పెద్ద
పొంతకూటికుండఁ గొంటఁ బోయెనెవ్వఁడో

చ. 3:

సొరిది సంతలలోని సుద్దులెల్ల విని విని
విరసములెల్లఁ బాపే విభుఁడెవ్వఁడో
తిరువేంకటగిరి దేవుఁడై యిందరికిఁ
గరుణ లోకము గాచే ఘనుఁడెవ్వఁడో