పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 9౦82-03 గుండక్రియ సం: 04-586 వైరాగ్య చింత

పల్లవి:

పాయమంట ముదిమంటా బహురూపము-యిఁక
నేయెడఁ గాచెదు మము నిందిరారమణ

చ. 1:

అన్నలంటా తమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా
పన్నుకొని తిరిగేరు బహురూపాలు
ఎన్నిక దినములలో నెవ్వరికి నేమేమి గల
రిన్నిటికి నీవె నాకు నిందిరారమణ

చ. 2:

చుట్టమంటా పక్కమంటా సుఖమంటా దుఃఖమంటా
పట్టులేక తెచ్చుకొన్న బహురూపము
వట్టివెతలఁ బడి వాడుదేరేము
ఎట్టు సేసినను జేయుమిందిరారమణ

చ. 3:

తల్లులంటాఁ దండ్రులంటా తప్పులంటా నొప్పులంటా
బల్లిదులఁ జేయలేని బహురూపాలు
వెల్లిగొన్న కృపతోడి వేంకటేశుఁడ నాకు
నెల్లనాఁడు నీవే కలవిందిరారమణ